జీఎస్టీ నమూనా చట్టం (MGL) సూచిస్తున్న నేరాలేమిటి? నేరాలు, జరిమానాల గురించి ఎంజీఎల్ లోని 16వ (XVI) అధ్యాయం క్రోడీకరిస్తుంది. ఇందులో సెక్షన్ 66 కింద 21 నేరాల జాబితాతోపాటు నివృత్తికి అర్హతలేని పన్ను విధించదగిన వ్యక్తి దాన్ని పొందడం కోసం చెల్లించాల్సిన జరిమానా గురించి సెక్షన్ 8 సూచిస్తుంది. నేరాల జాబితా కిందివిధంగా ఉంది:- బిల్లు లేకుండా లేదా తప్పుడు/అసమగ్ర బిల్లుతో వస్తు సరఫరా; సరఫరా చేయకుండానే బిల్లు జారీ; వసూలు చేసిన పన్నును మూడు నెలలు దాటినా జము చేయకపోవడం; ఎంజీఎల్ కు విరుద్ధంగా వసూలు చేసిన పన్నును మూడు నెలలు దాటినా చెల్లించకపోవడం; సెక్షన్ 37 కింద మూలం నుంచి పన్ను కోతను అమలు చేయకపోవడం లేదా కోత మొత్తం తగ్గించడం లేదా మూలంలో కోతపెట్టిన సొమ్మును జమ చేయకపోవడం; సెక్షన్ 43C కింద మూలం వద్ద పన్ను వసూలు చేయకపోవడం, వసూలు మొత్తాన్ని తగ్గించడం లేదా వసూలు చేసిన పన్ను మొత్తాన్ని చెల్లించకపోవడం; వస్తువులు, సేవల వాస్తవ రసీదులు లేకుండానే ఉత్పాదక కొనుగోళ్లపై చెల్లించిన పన్ను మినహాయింపు (ITC) నుంచి లబ్ది పొందడం లేదా వాడుకోవడం; మోసపూరిత పద్ధతులలో ఏదైనా వాపసు పొందడం; పన్ను ఎగవేత ఉద్దేశంతో సెక్షన్ 17కు విరుద్ధంగా ఐటీసీ సేవా పంపిణీదారుద్వారా సదరు లబ్ది పొందడం, ఐటీసీని పంపిణీ చేయడం; తప్పుడు సమాచారం ఇవ్వడం, ఆర్థిక వ్యవహారాల రికార్డులలో అవాస్తవాల నమోదు లేదా తప్పుడు ఖాతాలు/పత్రాల సమర్పణ; పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉన్నా నమోదు చేయడంలో వైఫల్యం; నమోదుకు ఇవ్వాల్సిన తప్పనిసరి వివరాల్లో అవాస్తవ సమాచారం ఇవ్వడం; అధికారి విధులకు ఆటంకం కలిగించడం లేదా పూర్తిగా అడ్డుకోవడం; నిర్దేశిత పత్రాలు లేకుండా వస్తువుల రవాణా; పన్ను ఎగవేతకు దారితీసేలా వార్షిక వ్యాపార పరిమాణంపై గోప్యత; చట్టం పేర్కొంటున్న పద్ధతిలో ఖాతాలు/పత్రాలు నిర్వహించడంలో వైఫల్యం లేదా చట్టం నిర్దేశిస్తున్న కాలం వరకూ వాటిని భద్రపరచకపోవడం; ఏదైనా విచారణ సందర్భంలో చట్టం/నిబంధనలకు అనుగుణంగా అధికారి కోరిన సమాచారం/పత్రాలు సమర్పించకపోవడం లేదా తప్పుడు సమాచారం/పత్రాలు అందజేయడం; జప్తు చేయదగిన వస్తువుల సరఫరా/రవాణా/నిల్వ చేయడం; మరొక వ్యక్తికి చెందిన 'వస్తుసేవల పన్ను చెల్లింపుదారు గుర్తింపు సంఖ్య’ (GSTIN)ను ఉపయోగించి బిల్లు లేదా పత్రం జారీచేయడం; భౌతిక సాక్ష్యాలను తారుమారు/నాశనం చేయడం; చట్టం కింద అదుపు/స్వాధీనం/అనుసంధానంలోని వస్తువులను అమ్మివేయడం/తారుమారు చేయడం. 'జరిమానా/అపరాధ రుసుము' (penalty) అనే పదానికి అర్థమేమిటి? "జరిమానా/అపరాధ రుసుము' గురించి ఎంజీఎల్ నిర్వచించలేదు. కానీ, న్యాయస్థానాల తీర్పులు, న్యాయశాస్త్ర మీమాంస దీని స్వభావాన్ని ఇలా సూచిస్తున్నాయి:- నిర్దిష్ట నేరం చేసినందుకు చట్టం విధించే తాత్కాలిక శిక్ష లేదా శిక్షకింద చెల్లించాల్సిన నగదు మొత్తం; కర్తవ్య నిర్వహణలో భాగంగా విధిని నిర్వర్తించకపోవడంపై చట్టం లేదా ఒప్పందం ప్రకారం విధించే శిక్ష. "జరిమానా/అపరాధ రుసుము' విధించడంలో అనుసరించాల్సిన సాధారణ సూత్రాలేమిటి? న్యాయ శాస్త్రం, సహాజ న్యాయం-అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల అమలు సూత్రావళి ప్రాతిపదికన నిర్దిష్ట క్రమశిక్షణ యంత్రాంగం విధించే శిక్షనే జరిమానా/అపరాధ రుసుముగా పేరో్కనవచ్చు. ఈ సాధారణ క్రమశిక్షణ చర్యను చట్టంలోని సెక్షన్ 68 వివరిస్తోంది. దీని ప్రకారం... ఏదైనా అంశంపై ఒక వ్యక్తికి నోటీసు జారీచేయకుండా వారి వాదనను పరిగణనలోకి తీసుకోకుండా జరిమానా విధించరాదు. విచారణలో భాగంగా తనపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించుకునే అవకాశాన్ని తోసిపుచ్చరాదు. కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలు, పరిస్థితుల మొత్తం ప్రాతిపదికన జరిమానాను విధించాలి. చట్టం, నియమాలు లేదా నిబంధనల ఉల్లంఘన తీవ్రతకు అనుగుణంగానే జరిమానా విధించాలి. జరిమానా విధింపు ఆదేశాలలో ఉల్లంఘన స్వభావాన్ని స్పష్టంగా పేర్కొనాలి. జరిమానా విధించేందుకు ప్రాతిపదికగా తీసుకున్న చట్ట నిబంధనలను కూడా స్పష్టంగా వివరించాలి. ఇక జరిమానా మొత్తం గణనీయంగా ఉండరాదని చట్టంలోని సెక్షన్ 68 నిర్దేశిస్తోంది. దీని ప్రకారం.... ఏదైనా స్వల్ప ఉల్లంఘన (ఏదైనా నిబంధనల ఉల్లంఘన కేసులో పన్ను ఎగవేత మొత్తం రూ.5వేలకన్నా తక్కువగా ఉన్నపుడు) లేదా చట్టంలోని విధానపరమైన అవసరం... లేదా మోసగించే ఉద్దేశంలేని, తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించరాని, పత్రాలలో సులభంగా సరిదిద్దగల పొరపాటు/విస్మరణ (రికార్డులలో కనిపించే పొరపాట్లుగా చట్టం వీటిని పేర్కొంటోంది) జరిగినప్పుడు.... అంతేగాక ఎంజీఎల్లో ఎక్కడెక్కడ జరిమానా మొత్తాన్ని లేదా నిర్ణీత శాతాన్ని చటం నిర్దేశిస్తున్నదో అక్కడ అదే వర్తించాలి. ఎంజీఎల్ లో నిర్దేశించిన జరిమానా మొత్తపు పరిమాణం మాటేమిటి? పన్ను విధించదగిన వ్యక్తి సెక్షన్ 66లో వివరించే ఏదైనా నేరానికి పాల్పడితే అతడికి విధించాల్సిన జరిమానా దిగువ తెలిపినదానికన్నా ఎక్కువగా ఉండాలని సెక్షన్ 66 (1) చెబుతోంది: ఎగవేసిన పన్ను మొత్తం, మోసపూరితంగా వాపసు పొందిన సొమ్ము; క్రెడిట్ ద్వారా పొందిన లబ్ది లేదా మూలంలో పన్ను తక్కువ కోతపెట్టడం లేదా అసలు వసూలు చేయకపోవడం లేదా పదివేల రూపాయలు. ఇక నమోదు చేసుకున్న పన్ను విధించదగిన వ్యక్తి పదేపదే తక్కువ పన్ను చెల్లిస్తుంటే విధించాల్సిన జరిమానా మొత్తం దిగువ పేర్కొన్నదానికన్నా ఎక్కువగా ఉండాలని సెక్షన్ 66(2) చెబుతోంది: తక్కువగా చెల్లించిన పన్ను మొత్తంలో పదిశాతం లేదా పదివేల రూపాయలు. జరిమానా విధింపులో "పునరావృత స్వల్ప చెల్లింపులు'గా వేటిని పరిగణిస్తారు? ఆరు వరుస పన్ను వ్యవధులలో మూడు రిటర్నులకు సంబంధించిన మూడు స్వల్ప చెల్లింపులను జరిమానా విధింపు కోసం "పునరావృత స్వల్ప చెల్లింపులుగా పరిగణించాలని సెక్షన్ 66(2) పేర్కొంటోంది. పన్ను విధించదగిన వ్యక్తులు కాకుండా ఇతరులకు జరిమానా విధింపును చట్టం సూచిస్తోందా? అవును. సెక్షన్ 66(3) ఇతరులకు రూ.25 మేలదాకా జరిమానా విధింపును సూచిస్తోంది. దీన్ని ఎవరిపై విధిస్తారంటే:- పైన పేర్కొన్న 21 నేరాలకు పాల్పడేవారికి సహాయపడే, ప్రోత్సహించేవారు, జప్తు చేయదగిన వస్తువుల (స్వీకరించడం, సరఫరా చేయడం, నిల్వ లేదా రవాణా చేయడం) వ్యవహారాలతో ప్రమేయం ఉన్నవారు, చట్టానికి విరుద్ధంగా సేవల స్వీకరించేవారు, సదరు వ్యవహారాలతో ప్రమేయం ఉన్నవారు. సమన్లు జారీచేసిన అధికారి ఎదుట హాజరుకాని వారు, సరఫరాపై చట్టప్రకారం బిల్లు జారీచేయని, బిల్లులను ఖాతాల్లో చూపునివారు. ఎంజీఎల్ కింద జరిమానాను ప్రత్యేకంగా సూచించని చట్ట ఉల్లంఘనలపై విధించే జరిమానా ఎంత? ఎంజీఎల్ కింద జరిమానాను ప్రత్యేకంగా సూచించని ఇతర చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వ్యక్తులను రూ.25వేలదాకా జరిమానాతో శిక్షించవచ్చునని సెక్షన్ 67 పేర్కొంటోంది. ప్రామాణిక పత్రాలు లేని వస్తు రవాణా లేదా పుస్తకాలలో సవ్యంగా నమోదు చేయని వస్తువుల తరలింపుపై తీసుకోదగిన చర్య ఏమిటి? చట్టం నిర్దేశించిన ప్రకారం తగిన పత్రాలు (బిల్లు, ప్రకటన) లేకుండా వస్తువులు రవాణా చేసినా లేదా అటువంటి వస్తువులను మార్గమధ్యంలో నిల్వచేసినా లేదా పుస్తకాలలో నమోదు చేయకుండా సరఫరా/నిల్వ చేసినా వాటిని రవాణా చేసే వాహనంసహా వస్తువులను అదుపులోకి తీసుకోవచ్చు. వాటికి వర్తించే పన్ను, వడ్డీ, జరిమానాలను చెల్లించాక లేదా సదరు సొమ్ముకు సమానమైన మొత్తానికి హామీపత్రం సమర్పించాక వస్తువులను, వాహనాలను విడుదల చేయవచ్చు. 'సరళ పన్ను లెక్కింపు పథకా’నికి (composition scheme) అనర్హుడైన వ్యక్తి దాని వర్తింపు కోసం విజ్ఞప్తి చేస్తే విధించదగిన జరిమానా ఎంత? ఎవరైనా వ్యక్తి తన పన్ను బాధ్యత నిర్ధారణ కోసం విజ్ఞప్తి చేసినప్పుడు అతడు నివృతికి అనర్హుడని గుర్తిస్తే నిబంధనల ప్రకారం సదరు వ్యక్తి తాను చెల్లించాల్సిన పన్నుకు సమానమైన జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సెకన్ 8(3) చెబుతోంది. అంటే... అందరిలా పన్ను విధించదగిన వ్యక్తిగా పరిగణించి పన్నుకు సమానమైన మొత్తాన్ని అదనంగా జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుంది. ‘జప్తు' (confiscate) అంటే అర్థమేమిటి? ‘జప్తు' అనే పదాన్ని చట్టంలో నిర్వచించ లేదు. ఈ భావన రోమన్ల చట్టం నుంచి స్వీకరించినది. వారి అర్థం ప్రకారం ఇది 'స్వాధీనం చేసుకోవడం లేదా చక్రవర్తి చేతుల్లోకి తీసుకోవడం’, ఆ తర్వాత రాచరిక ‘ఫిస్కస్' లేదా ఖజానాకు జమ చేయడం అన్నమాట. అయ్యర్ న్యాయశాస్త్ర నిఘంటువు దీన్ని "జరిమూనా కింద ప్రభుత్వ ఖజానాకు కేటాయించిన ప్రైవేటు ఆస్తి, రాజ్యానికి ధారపోసిన ఆస్తి"గా నిర్వచించింది. ఎంజీఎల్ కింద ఏయే పరిస్థితులలో వస్తువులను "జపు' (COnfiSCate) చేయవచ్చు? ఎంజీఎల్ లోని సెక్షన్ 70 కింద వస్తువులను ఎప్పుడెప్పుడు జప్తు చేయవచ్చునంటే:- పన్ను ఎగవేతకు దారితీసే విధంగా చట్టంలోని ఏదైనా నిబంధనను ఉల్లంఘించి వస్తువులు సరఫరా చేయడం; లేదా చట్టం నిర్దేశించిన మేరకు ఏ విధానంలోనూ వస్తు సరఫరాను నమోదు చేయకపోవడం... లేదా నమోదు చేసుకోకుండానే పన్ను విధించదగిన వస్తువులను సరఫరా చేయడం... లేదా పన్ను ఎగవేసే ఉద్దేశంతో చట్టం లేదా నిబంధనలను ఉల్లంఘించడం. సముచిత అధికారి జప్తు చేసిన వస్తువలు ఏమవుతాయి? జప్తు అనంతరం సదరు వస్తువులపై హక్కు ప్రభుత్వానికి బదిలీ అవుతుంది. దీనికి సంబంధించి సముచిత అధికారి విజ్ఞప్తి మేరకు ప్రతి పోలీసు అధికారి సదరు వస్తువుల స్వాధీనంలో తోడ్పడాల్సి ఉంటుంది. వస్తువుల జప్తు తర్వాత వాటిని తిరిగి పొందడానికి సదరు వ్యక్తికి అవకాశం ఇవ్వాలా? ఇవ్వాలి. వస్తువుల జప్తునకు బాధ్యుడైన వాటి యజమాని లేదా సంరక్షకుడికి సెక్షన్ 70 (6) ప్రకారం జప్తు స్థానంలో జరిమానా (వస్తువుల మార్కెట్ ధరకు మించకుండా) చెల్లించే అవకాశం ఇవ్వాలి. సదరు వస్తువులపై చెల్లించాల్సిన పన్ను, ఇతర రుసుములకు ఈ జరిమానా అదనం. తగిన పత్రాలు లేని వస్తువులను రవాణా చేస్తున్న వాహనం కూడా జప్తు పరిధిలోకి వస్తుందా? వస్తుంది. చట్టం నిర్దేశిస్తున్న సరైన పత్రాలు లేదా వివరాలు లేకుండా వస్తువులను రవాణా చేసే వాహనం కూడా సెక్షన్ 71 ప్రకారం జప్తు పరిధిలోకి వస్తుంది. అయితే, ఆ వస్తువులకు సంబంధించిన సరైన పత్రాలేవీ లేవన్నది తనకు తెలియదని, వస్తువుల యజమాని/అతడి ప్రతినిధితో ఎలాంటి రహస్య ఒప్పందం లేదని వాహన యజమాని నిరూపించుకోవాలి. అలా చేయగలిగితే వాహనం జప్తు పరిధిలోకి రాదు. ఇక జప్తు చేసిన వాహనం అద్దెకు వస్తువులను లేదా ప్రయాణికులను తరలించేదైతే, దాని జప్తునకు బదులు వస్తువులపై చెల్లించాల్సిన పన్నుకు సమానమైన మొత్తం చెల్లించే అవకాశాన్ని వాహన యజమానికి ఇస్తారు. సరైన పత్రాలు లేకుండా వస్తువులు తరలించే నేరానికి చట్టం సూచిస్తున్నఇతర శిక్ష/చర్యల విషయంలో పక్షపాతం లేకుండా సెక్షన్లు 70 లేదా 71 కింద జప్తు లేదా జరిమానా విధించాలని సెక్షన్ 72 పేర్కొంటోంది. విచారణ (Prosecution) అంటే ఏమిటి? విచారణ అనేది కేసు నమోదు లేదా న్యాయపరమైన చర్యలకు నాంది; దోషులపై ప్రాథమిక ఆరోపణలను నమోదుచేసే ప్రక్రియ. నేరశిక్షా స్మృతి (Cr.P.C)లోని సెక్షన్ 198 నిర్వచనం ప్రకారం ‘విచారణ’ అంటే ఒక వ్యక్తిపై కేసు నమోదు, న్యాయపరమైన చర్యలు ప్రారంభించడం. ఎంజీఎల్ కింద విచారణార్హమైన నేరాలేవి? ఎంజీఎల్ కింద నేర విచారణ ప్రక్రియకు వీలున్న నేరాలను చట్టంలోని సెక్షన్ 73 వివరిస్తోంది. ఈ మేరకు సదరు 12 ప్రధాన నేరాల జాబితా కిందివిధంగా ఉంది:- బిల్లు లేకుండా వస్తువుల సరఫరా లేదా తప్పుడు/అసమగ్ర బిల్లు జారీ; వస్తు సరఫరా లేకుండానే బిల్లు జారీ; వసూలు చేసిన పన్నును మూడు నెలలు దాటినా చెల్లించకపోవడం; ఎంజీఎల్ కు విరుద్ధంగా వసూలు చేసిన పన్నును మూడు నెలలు దాటినా చెల్లించకపోవడం; వస్తువులు, సేవల వాస్తవ రసీదులు లేకుండానే ఉత్పాదక కొనుగోళ్లపై చెల్లించిన పన్ను మినహాయింపు (ITC) నుంచి లబ్ది పొందడం లేదా వాడుకోవడం; మోసపూరిత పద్ధతులలో ఏదైనా వాపసు పొందడం; పన్ను ఎగవేత ఉద్దేశంతో తప్పుడు సమాచారం ఇవ్వడం, ఆర్థిక వ్యవహారాల రికార్డులలో అవాస్తవాల నమోదు లేదా తప్పుడు ఖాతాలు/పత్రాల సమర్పణ; అధికారి విధులకు ఆటంకం కలిగించడం లేదా పూర్తిగా అడ్డుకో వడం; జప్తు చేయదగిన వస్తువుల సరఫరా/రవాణా/నిల్వ చేయడం వంటి వ్యవహారాలతో ప్రమేయం; చట్టానికి విరుద్ధంగా సేవలు స్వీకరించడం, సదరు వ్యవహారాలతో ప్రమేయం; తమకు సంబంధించి చట్టం/ నిబంధనల ప్రకారం అందజేయాల్సిన సమాచారం ఇవ్వకపోవడం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం; పైన పేర్కొన్న 11 నేరాల్లో దేనికైనా పాల్పడే ప్రయత్నం లేదా అందుకు పాల్పడేవారిని ప్రోత్సహించడం దోష నిర్ధారణ తర్వాత ఎంజీఎల్ కింద సూచించిన శిక్ష ఏమిటి? ఎంజీఎల్ లోని సెక్షన్ 73(1) కింద శిక్షల ప్రణాళిక కిందివిధంగా ఉంటుంది: నేర స్వభావం శిక్ష (కారాగారవాస కాలం) రూ.250 లక్షలు మించి పన్ను ఎగవేత ఐదేళ్ల వరకూ జైలు, జరిమానా రూ.50 లక్షలు-రూ.250 లక్షల మధ్య ఎగవేత మూడేళ్ల వరకూ జైలు, జరిమానా రూ.25 లక్షలు-రూ.50 లక్షల మధ్య ఎగవేత ఏడాది వరకూ జైలు, జరిమానా రెండోసారి లేదా తదుపరి ఏదైనా నేరంలో కూడా దోష నిర్ధారణ అయితే ఐదేళ్లదాకా జైలుశిక్షతోపాటు జరిమానా విధించవచ్చునని సెక్షన్ 73 (2) పేర్కొంటోంది. అయితే, ఈ నేరాల్లో దేనికైనా కనీస శిక్ష ఆరు నెలలకన్నా తక్కువగా ఉండకూడదు. ఎంజీఎల్ కింద కేసు పెట్టదగిన, విచారణార్ధంకాని నేరాలేవి? ఎంజీల్ సెకన్లు 73 (3), 73 (4) ప్రకారం... పన్ను ఎగవేత రూ.250 లక్షలు దాటినప్పుడు అలాంటివన్నీ కేసు పెట్టదగిన, బెయిలుకు వీల్లెని (non-bailable) నేరాలు పన్ను ఎగవేత రూ.250 లక్షలు దాటని నేరాలు విచారణార్హం కానివి, బెయిలు పొందగలిగినవే. విచారణ చేపట్టేందుకు సముచిత అధికారి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలా? అవును. నిర్దేశిత అదికార స్థానం నుంచి ముందస్తు అనుమతి లేనిదే ఏ వ్యక్తిపైనా విచారణ చేపట్టే వీలు లేదు. ఎంజీల్ కింద విచారణ చేపట్టేందుకు నిందితులలో 'అపరాధ చింతన' (mensrea) లేదా నేరపూరిత మానసిక స్థితి ప్రస్తావన అవసరమా? అవును. అయితే, నేరపూరిత మన:స్థితి లేనిదే ఏదైనా నేరం జరగదని, అటువంటి మానసిక స్థితి ఉనికి (అంటే నేరపూరిత మనస్తత్వం లేదా అపరాధ చింతన) ఉంటుందని సెక్షన్ 76 భావిస్తుంది. నేరపూరిత మానసిక స్థితి (culpable state of mind) అంటే ఏమిటి? ఏదైనా చర్యకు పాల్పడే సమయంలో ఓ ‘నేరపూరిత మానసిక స్థితి’ వంటి మనస్తత్వం ఉన్నపుడు- సదరు చర్య ఉద్దేశపూర్వకమే; సదరు చర్య, దాని పరిణామాలను అర్థం చేసుకోవచ్చు. నియంత్రించవచ్చు: సదరు చర్యకు పాల్పడే వ్యక్తి ఒత్తిడికి లోనై ఉండడు, చివరకు అడ్డంకులను కూడా అధిగమిస్తాడు; సదరు చర్య చట్టవిరుద్దమని విశ్వసిస్తాడు లేదా అందుకు తగిన కారణాలున్నట్లు భావిస్తాడు. ఎంజీల్ కింద ఏ కంపెనీకైనా వ్యతిరేకంగా చర్యలు లేదా ఏదైనా నేరం కింద విచారణ చేపట్టవచ్చా? చేపట్టవచ్చు. ఎంజీఎల్ లోని సెక్షన్ 77 అందుకు అవకాశం కల్పిస్తుంది. ఒక కంపెనీకి బాధ్యుడుగా లేదా దాని వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు బాధ్యుడుగా ఉన్న ప్రతి వ్యక్తితోపాటు సదరు కంపెనీపైనా చర్యలు లేదా విచారణ చేపట్టవచ్చు. సదరు కంపెనీకి బాధ్యుడైన వ్యక్తి వ్యవహారాలు నడుపుతున్నందున ఆ కంపెనీ చేసే నేరానికీ అతడు బాధ్యుడవుతాడు కాబట్టి విచారించి శిక్షించవచ్చు. కంపెనీ ఏదైనా నేరం చేస్తే- అది అనుమతి/రహస్య ఒప్పందంతో చేసినదిగానూ, సదరు కంపెనీలోని ఎవరైనా అధికారి నిర్లక్ష్యం అందుకు కారణంగా పరిగణిస్తే ఆ నేరంలో సదరు అధికారి దోషి అవుతారు. కాబట్టి విచారణ ప్రారంభించి తదనుగుణంగా శిక్షించవచ్చు. నేరాల నివృత్తి (compounding of offences) అంటే ఏమిటి? ‘నేరాల నివృత్తి’ అంటే పరిశీలన లేదా ఏదైనా ప్రైవేటు ఉద్దేశంతో విచారణ నుంచి మినహాయించడంగా నేర శిక్షాస్మృతి (Cr.P.C)లోని సెక్షన్ 320 నిర్వచిస్తుంది. ఎంజీల్ కింద నేరాల నివృత్తి సాధ్యమేనా? సాధ్యమే. ఎంజీఎల్లోని సెక్షన్ 78 ప్రకారం... దిగువ పేర్కొన్నవి మినహా ఇతర ఏ నేరమైనా నిర్దేశిత నగదు చెల్లింపు (Compounding)తో నివృత్తి చేయవచ్చు. అటువంటి నేర నివృత్తి విచారణ ప్రారంభానికి ముందు, ఆ తర్వాత కూడా ఆమోదయోగ్యమే: పైన పేర్కొన్న 12 ప్రధాన నేరాలలో 1 నుంచి 7 వరకూ (16వ ప్రశ్నలో సూచించినవి) ఉన్నవాటిలో నిందితుడైన వ్యక్తి అంతకుముందు నివృత్తి పొంది ఉంటే; పైన పేర్కొన్న నేరాలలో 1 నుంచి 7 వరకూ ఉన్నవాటికి పాల్పడినవారికి తోడ్పడి/ప్రోత్సహించిన వ్యక్తి అంతకుముందు నివృత్తి పొంది ఉంటే; ఎస్టీఎస్టీ/ఐజీఎస్టీ చట్టాల కింద రూకోటికి మించి విలువైన సరఫరాలకు సంబంధించి ఏదైనా నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అంతకుముందు పైన పేర్కొన్న నేరాలలో నివృత్తి పొంది ఉంటే; సీజీఎస్టీ/ఎస్జీఎస్టీ చట్టాలు కాకుండా NDPSA లేదా FEMAలతోపాటు ఇతర చట్టాల కింద నేరంగా పరిగణించబమే ఏదైనా నేరానికి పాల్పడి ఉంటే; దీనికి సంబంధించి సూచించబడిన ఇతర నేరవర్గాలు లేదా వ్యక్తులు. పన్ను, వడ్డీ, జరిమానా, నివృత్తి రుసుము చెల్లించిన తర్వాతే నివృత్తి లభిస్తుంది. అలాగే నివృత్తి ఫలితంగా అంతకుముందు ఏదైనా చట్టం కింద కొనసాగుతున్న నేర విచారణలకు ఎలాంటి భంగం కలగదు. నేర నివృత్తికి నగదుపరమైన పరిమితులేవైనా ఉన్నాయా? ఉన్నాయి. నివృత్తికి కనిష్ట పరిమితి దిగువ పేర్కొన్న మొత్తాలకన్నా ఎక్కువగా ఉండాలి:- 50 శాతం పన్నుతో ముడిపడినవి లేదా; రూ.10,000... నివృత్తికి గరిష్ట పరిమితి దిగువ పేర్కొన్న మొత్తాలకన్నా ఎక్కువగా ఉండాలి:- 150 శాతం పన్నుతో ముడిపడినవి లేదా రూ.30,000. ఎంజీల్ కింద ఏదైనా నేర నివృత్తి తర్వాతి పరిణామాలేమిటి? నివృత్తి మొత్తం చెల్లించిన తర్వాత ఈ చట్టం కింద తదుపరి చర్యలుండవని సెక్షన్ 77 ఉపు సెక్షన్(3) వివరిస్తోంది. అంతేగాక అప్పటికే ప్రారంభమైన నేర విచారణ ప్రక్రియ ఉపశమిస్తుంది. ఆధారం : సెంట్రల్ బోర్డ్ అఫ్ ఎక్సైజ్ మరియు కస్టమ్స్